కోవిడ్ బారినపడిన ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి

Updated: Saturday, May 1, 2021, 20:20 [IST]

 
         కరోనా బారినపడి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందేలా  వెంటనే చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం సాయంత్రం ఈఓ అధికారులతో సమావేశం నిర్వహించారు. 
 
     ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఉద్యోగుల్లో ఇప్పటివరకు వాక్సినేషన్ వేసుకోని వారిని గుర్తించి వెంటనే వ్యాక్సిన్ వేయించాలని, రెండో డోసు కావాల్సిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం వచ్చే ఉద్యోగులతో రద్దీ లేకుండా చూడాలన్నారు. విభాగాల వారీగా వ్యాక్సినేషన్ వేసుకున్న ఉద్యోగుల సంఖ్య, కరోనాతో ఆస్పత్రుల్లో చేరిన ఉద్యోగుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టిటిడి ఉద్యోగుల కోసం స్విమ్స్ లో కొన్ని బెడ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. స్విమ్స్, ఎస్వీ ఆయుర్వేద, రుయా తదితర ఆసుపత్రులో ఆక్సిజన్ నిల్వలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు కోరిన విధంగా 50 : 50 నిష్పత్తిలో విధులకు హాజరయ్యేందుకు, వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈవో అనుమతించారు. టిటిడిలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరగాలన్నారు. తిరుమలకు వెళ్లే ఉద్యోగులకు ప్రత్యేకంగా రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు.
 
       ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి, జెఈఓ శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, బర్డ్ ఇంచార్జ్ ఆర్ఎంవో శ్రీ శేషశైలేంద్ర, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, సిఎంవో డాక్టర్ మురళీధర్, బర్డ్ ప్రత్యేకాధికారి శ్రీ రెడ్డెప్పరెడ్డి, రవాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.