ఎండు ద్రాక్ష‌, వ‌క్క‌లు, ప‌సుపు కొమ్ముల‌ మాల‌ల‌తో వేడుక‌గా శ్రీ‌నివాసునికి స్న‌ప‌నం

Updated: Sunday, September 20, 2020, 17:24 [IST]         బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆదివారం శ్రీ‌వారి ఆల‌యంలో ఎండు ద్రాక్ష‌, వ‌క్క‌లు, ప‌సుపు కొమ్ముల‌‌తో ప్ర‌త్యేకంగా రూపొందించిన మాల‌ల‌తో స్న‌ప‌న‌తిరుమంజ‌నం వేడుక‌గా జ‌రిగింది. రంగ‌నాయ‌కుల మండ‌పంలో ప్ర‌త్యేక వేదిక‌పై ఆశీనులైన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి వేద మంత్రాల న‌డుమ కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ గోవిందాచార్యులు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

         దాదాపు రెండు గంట‌ల పాటు జ‌రిగిన స్న‌ప‌న‌తిరుమంజ‌నంలో వివిధ‌ ర‌కాల మాల‌ల‌తో శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు భ‌క్తుల‌కు క‌నువిందు చేశారు. ప‌లు ర‌కాల సుగంధ ద్ర‌వ్యాల‌తో అభిషేకం చేస్తుండ‌గా, ప్ర‌త్యేక మాల‌ల‌ను అలంక‌రించారు. ఎండుద్రాక్ష‌, వ‌క్క‌లు, ప‌సుపుకొమ్మ‌లు, తుల‌సి గింజ‌లు, తామ‌ర గింజ‌లు, త‌మ‌ల పాకులు, రోజా పూల రేకులు మ‌రియు ప‌గ‌డపు పూల‌తో త‌యారు చేసిన మాల‌లు అలంక‌రించామ‌ని ఉద్యానవ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు తెలిపారు.

ఆకట్టుకున్న ఫల పుష్ప మండపం

         స్నపనతిరుమంజనం నిర్వహించే రంగ నాయ‌కుల మండపాన్నివివిధ ర‌కాల సాంప్ర‌దాయ పుష్పాలు, క‌ట్ ఫ్ల‌వ‌ర్స్‌, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలు, ఆస్ట్రేలియ బ‌త్త‌యి, ద్రాక్ష గుత్తుల‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. క‌మ‌నీయంగా సాగిన ఈ స్న‌ప‌న తిరుమంజ‌నాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

           ఈ కార్య‌క్ర‌మంలో ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్ పాల్గొన్నారు