15న నరసరావుపేట పేటలో టీటీడీ కామధేను పూజ - హాజరు కానున్న సిఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి

Updated: Wednesday, January 13, 2021, 08:57 [IST]

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో టీటీడీ జనవరి 15వ తేదీ కామధేను పూజ ( గోపూజ) నిర్వహించనుంది. స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో  మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. టీటీడీ అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో శ్రీ బసంత్ కుమార్ నేతృత్వంలో మంగళవారం అధికారులు స్థల పరిశీలన జరిపారు.
      సత్తెనపల్లి మార్గం లోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం ఇందుకు అనువైనదని నిర్ణయించారు.   స్థానిక శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం తో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు ఈవో , జెఈవో టీటీడీ అధికారులను ఆదేశించారు.
        
రాష్ట్ర వ్యాప్తంగా ఓకే సమయంలో గో పూజ :  జెఈవో  శ్రీ బసంత్ కుమార్
 
      స్థల పరిశీలన అనంతరం జెఈవో శ్రీ బసంత్ కుమార్ మీడియా మాట్లాడారు. కనుమ పండుగ రోజు కొన్ని శతాబ్దాలుగా టీటీడీ గో పూజ నిర్వహిస్తోందన్నారు. ఈ సారి టీటీడీ ఆధ్వర్యంలో ని సుమారు 50 ఆలయాలతో పాటు, టీటీడీ  ఆర్థిక సహకారంతో దేవాదాయశాఖ ఆధీనంలోని 996 ఆలయాలు, 6ఎ ఆలయాల్లో కూడా  15వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు గోపూజ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. నరసరావుపేటలో జరిగే  కామధేను పూజకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారన్నారు.
 
ఇది మహద్భాగ్యం : డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే
 
     రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సకాలంలో వర్షాలు కురవాలనే ఆకాంక్షతో టీటీడీ నరసరావుపేటలో  కామధేను పూజ నిర్వహించడం ఈ ప్రాంత వాసుల మహద్భాగ్యమని శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి సిఎం గా ప్రమాణ స్వీకారం చేశాక  కామధేను పూజలో పాల్గొనడానికి తొలిసారి నరసరావుపేటకు రావడం సంతోషన్నారు.
 
        గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ  శ్యామ్యూల్ ఆనంద్,  రూరల్ఎస్పీ శ్రీ  విశాల్ గున్ని,కోటప్ప కొండ ఆలయ ఈవో శ్రీ అన్నపురెడ్డి రాంకోటి రెడ్డి, స్థానిక ఇస్కాన్ ప్రతినిధులు, టీటీడీ సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
      అంతకు ముందు అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో శ్రీ బసంత్ కుమార్ కోటప్పకొండ ఆలయాన్ని దర్శించుకున్నారు.