కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ప్రాంతాల‌ను ప‌రిశీలించిన టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

By Telugu Content

Updated:Saturday, December 4, 2021, 08:31[IST]

కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ప్రాంతాల‌ను ప‌రిశీలించిన టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

రెండో ఘాట్ రోడ్డులో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన నేప‌థ్యంలో తిరుపతి - తిరుమ‌ల మ‌ధ్య వాహ‌నాల్లో ప్ర‌యాణించేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌డుతోంద‌ని, ఈ ఆల‌స్యాన్ని త‌గ్గించేందుకు డిసెంబ‌రు 4వ తేదీ ఉద‌యం నుండి లింకు రోడ్డు ద్వారా వాహ‌నాల‌ను అనుమ‌తిస్తామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు.

 

టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆదేశాల మేర‌కు శుక్ర‌వారం సాయంత్రం అద‌న‌పు ఈవో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ప్రాంతాన్ని ప‌రిశీలించారు.

 

ఈ సంద‌ర్భంగా అద‌నపు ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబ‌రు 1న ఉద‌యం అప్ ఘాట్ రోడ్డులో చివ‌రి మలుపు వ‌ద్ద వ‌ర్షానికి భూమి వ‌దులై పెద్ద బండ‌రాళ్లు ఊడి ప‌డ్డాయ‌ని, ఈ కార‌ణంగా 3 రోడ్ల‌కు పూర్తిగా న‌ష్టం వాటిల్లింద‌ని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా త‌నిఖీ చేశామ‌ని, ఢిల్లీ ఐఐటి ప్రొఫెస‌ర్లు క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేశార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఒక బండ‌రాయి ఊడిప‌డేలా ఉండ‌డంతో దాని ప‌టిష్ట‌త‌ను ఐఐటి నిపుణులు ప‌రిశీలించి ఎలాంటి స‌మ‌స్య ఉండ‌ద‌ని, ట్రాఫిక్‌ను అనుమ‌తించాల‌ని సూచించార‌ని తెలిపారు. కావున అప్ ఘాట్ రోడ్డులో వాహ‌నాల‌ను అనుమ‌తించి లింక్ రోడ్డు ద్వారా డౌన్ ఘాట్‌కు వెళ్లి తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తామ‌ని వివ‌రించారు. త‌ద్వారా 75 శాతం ఆల‌స్యాన్ని అధిగ‌మించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

 

కొండ‌చ‌రియ‌లు విరిగిన ప్రాంతంలో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు పూర్తి చేసే విష‌యంపై ఐఐటి నిపుణులు, ఇంజినీరింగ్ అధికారుల‌తో టిటిడి ఛైర్మ‌న్ శుక్ర‌వారం స‌మావేశం నిర్వ‌హించార‌ని చెప్పారు. పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు పూర్తి చేసేందుకు ఒక నెల స‌మ‌యం ప‌డుతుంద‌ని నిపుణులు సూచించార‌ని, ఇందుకోసం ఎంతో నైపుణ్యం గ‌ల ఆఫ్కాన్ సంస్థ‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించామ‌ని తెలిపారు. ఆఫ్కాన్ సంస్థ‌కు చెందిన ఒక నిపుణుల బృందం 20 రోజుల్లో డిజైన్ సిద్ధం చేయాల‌ని కోరామ‌ని, మ‌రో నిపుణుల బృందం ఘాట్ రోడ్డులో అన్ని బండ‌రాళ్ల‌ను ప‌రిశీలించి స‌ర్వే చేసి మ‌రింత బలంగా మార్చేందుకు యాంక‌రింగ్‌, ట్రిమ్మింగ్ త‌దిత‌ర ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించామ‌ని వెల్ల‌డించారు. ఈ మొత్తం ప‌నులు 25 రోజుల్లో పూర్త‌వుతాయ‌న్నారు.

 

అదనపు ఈవో వెంట సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వర రావు, ఢిల్లీ ఐఐటి నిపుణులు శ్రీ కె.ఎస్‌.రావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇఇ శ్రీ సురేంద్రారెడ్డి, ఆఫ్కాన్ సంస్థ ఇంజినీరింగ్ నిపుణులు ఉన్నారు.

 

న‌వంబ‌రు 18 నుండి డిసెంబ‌రు 10వ తేదీ వ‌ర‌కు ద‌ర్శ‌న టికెట్లు గ‌ల భ‌క్తుల‌కు రీషెడ్యూల్ స‌దుపాయం

 

న‌వంబ‌రు 18 నుండి డిసెంబ‌రు 10వ తేదీ వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు గ‌ల భ‌క్తులు త‌మ ద‌ర్శ‌న తేదీని రీషెడ్యూల్ చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు.

 

భారీ వ‌ర్షాల కార‌ణంగా ఈ తేదీల్లో తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రాలేక‌పోయిన భ‌క్తులు 6 నెల‌ల్లోపు ద‌ర్శ‌న స్లాట్ల‌ను రీషెడ్యూల్‌ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని, భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోరారు.